Joshua 17

1మనష్షే యోసేపు పెద్ద కుమారుడు కాబట్టి అతని గోత్రానికి, అంటే మనష్షే పెద్ద కుమారుడు గిలాదు దేశాధిపతి అయిన మాకీరుకు చీట్ల వలన వంతు వచ్చింది. అతడు యుద్ధవీరుడు కాబట్టి అతనికి గిలాదు బాషాను వచ్చాయి. 2మనష్షీయులలో మిగిలిన వారికి, అంటే అబియెజెరీయులకూ హెలకీయులకూ అశ్రీయేలీయులకూ షెకెమీయులకూ హెపెరీయులకూ షెమీదీయులకూ వారి వారి వంశాల ప్రకారం వంతు వచ్చింది. వారి వంశాలను బట్టి యోసేపు కుమారుడు మనష్షే యొక్క మగ సంతానమది.

3మనష్షే మునిమనుమడూ మాకీరు ఇనుమనుమడూ గిలాదు మనుమడూ హెపెరు కుమారుడూ అయిన సెలోపెహాదుకు కూతుర్లే గాని కుమారులు పుట్టలేదు. అతని కూతుర్ల పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. 4వారు యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడు యెహోషువ, ప్రధానుల దగ్గరకు వచ్చి, <<మా సోదరుల మధ్య మాకు స్వాస్థ్యమివ్వాలని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు>> అని చెప్పారు. కాబట్టి, యెహోషువ యెహోవా సెలవిచ్చినట్టుగా వారి తండ్రి సోదరులతో బాటు వారికి స్వాస్థ్యం ఇచ్చాడు.

5కాబట్టి యొర్దాను అవతల ఉన్న గిలాదు బాషానులు కాక మనష్షీయులకు పదివంతులు హెచ్చుగా వచ్చాయి. 6ఎందుకంటే మనష్షీయుల స్త్రీ సంతానం వారి పురుష సంతానం స్వాస్థ్యం పొందాయి. గిలాదు దేశం మిగతా మనష్షీయులకు స్వాస్థ్యం అయింది.

7మనష్షీయుల సరిహద్దు ఆషేరు నుండి షెకెముకు తూర్పుగా ఉన్న మిక్మెతావరకు దక్షిణాన ఏన్తప్పూయ నివాసుల వైపుకు వ్యాపించింది. 8తప్పూయ భూభాగం మనష్షీయులది. అయితే మనష్షీయుల సరిహద్దు లోని తప్పూయ పట్టణం ఎఫ్రాయిమీయులది అయింది.

9ఆ సరిహద్దు కానా వాగు వరకు ఆ వాగుకు వ్యాపించింది. వాగుకు దక్షిణాన ఉన్న మనష్షీయుల పట్టణాలు దగ్గరి ప్రాంతం ఫ్రాయిమీయులకు సంక్రమించింది. అయితే మనష్షీయుల సరిహద్దు ఆ వాగుకు ఉత్తరంగా సముద్రం వరకు వ్యాపించింది. 10దక్షిణ భూమి ఎఫ్రాయిమీయులకు ఉత్తరభూమి మనష్షీయులకు వచ్చింది. సముద్రం వారి సరిహద్దు. ఉత్తరం వైపున అది ఆషేరీయుల సరిహద్దుకు, తూర్పు వైపున ఇశ్శాఖారీయుల సరిహద్దుకు అనుకుని ఉంది.

11ఇశ్శాఖారీయుల ప్రదేశంలో ఆషేరీయుల ప్రదేశంలో బేత్ షెయాను, దాని గ్రామాలూ ఇబ్లెయాము, దాని గ్రామాలూ దోరు నివాసులు, దాని గ్రామాలూ ఏన్దోరు నివాసులు, దాని గ్రామాలూ తానాకు నివాసులు, దాని గ్రామాలూ మెగిద్దో నివాసులు, దాని గ్రామాలూ అంటే మూడు కొండల ప్రదేశం మనష్షీయులకు వచ్చింది. 12కనానీయులు ఆ దేశంలో నివసించాలని గట్టిగా ప్రయత్నించారు కాబట్టి మనష్షీయులు ఆ పట్టణాలను స్వాధీనపరచుకోలేక పోయారు.

13ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయులతో వెట్టిచాకిరి చేయించుకున్నారు కాని వారి దేశాన్ని మాత్రం పూర్తిగా స్వాధీనపరచుకోలేదు.

14అప్పుడు యోసేపు వంశంవారు యెహోషువతో <<మాకు ఒక్క చీటితో ఒక్క వంతే స్వాస్థ్యంగా ఇచ్చావేంటి? మేము గొప్ప జనం గదా? ఇంతవరకు యెహోవా మమ్మల్ని దీవించాడు>> అని మనవి చేశారు. 15యెహోషువ వారితో, <<మీరు గొప్ప జనం కాబట్టి ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతం మీకు ఇరుకుగా ఉంటే మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీయులు రెఫాయీయులు ఉన్న ప్రదేశానికి వెళ్లి అడవి నరుక్కొని అక్కడ ఉండండి>> అన్నాడు.

16అందుకు యోసేపు వంశం వారు <<ఆ కొండ ప్రాంతం మాకు చాలదు, లోయ ప్రాంతంలో ఉంటున్న కనానీయులందరికీ అంటే బేత్ షెయానులో, దాని గ్రామాలలో యెజ్రెయేలు లోయలో ఉన్న వాళ్లకు ఇనుప రథాలు ఉన్నాయి>> అన్నారు. 17అప్పడు యెహోషువ యోసేపు సంతతి వారైన ఎఫ్రాయిమీయులను, మనష్షీయులను చూచి, <<మీరు ఒక గొప్ప జనం, మీది గొప్ప బలం. మీకు ఒక్క వాటా మాత్రమే ఉండకూడదు. ఆ కొండ మీదే, అది అడవి కాబట్టి మీరు దానిని నరికి స్వాధీనం చేసుకోవాలి. కనానీయులకు ఇనుప రథాలున్నా, వాళ్ళు బలవంతులైనా మీరు వారిని వెళ్ళగొట్టగలరు>> అన్నాడు.

18

Copyright information for TelULB